మాజీలను చుట్టేస్తున్న కేసులు..!

మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైలు జీవితం_ _అనుచిత వ్యాఖ్యల కేసులో కోవూరు ప్రసన్న_ _మద్యం ముడుపులు కేసు చేరువుగా కావలి రామిరెడ్డి_ _తాజాగా మాజీ మంత్రి అనిల్‌, మాజీ డీసీఎంఎస్ ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తి, మ‌రి కొంద‌రికి నోటీసులు_ _నెల్లూరు జిల్లా వైసిపిలో ఉక్కిరిబిక్కిరి_

మాజీలను చుట్టేస్తున్న కేసులు..!

మైనింగ్ కేసులో ఇప్పటికే కాకాణి జైలు జీవితం

అనుచిత వ్యాఖ్యల కేసులో కోవూరు ప్రసన్న

మద్యం ముడుపులు కేసు చేరువుగా కావలి రామిరెడ్డి

తాజాగా మాజీ మంత్రి అనిల్‌, మాజీ డీసీఎంఎస్ ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తి, మ‌రి కొంద‌రికి నోటీసులు

నెల్లూరు జిల్లా వైసిపిలో ఉక్కిరిబిక్కిరి

నెల్లూరు జిల్లా వైసీపీలో ఉక్కిరిబిక్కిరి వాతావరణం నెలకుంది. పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలను పోలీసు కేసులు చుట్టేస్తున్నాయి. నాడు ఐదేళ్ల అధికారంలో.. జిల్లాలో వారు చెప్పిందే శాసనం.. చేసిందే చట్టంలా వ్యవహరించారు. జిల్లాలో గట్టి నాయకులు, పార్టీలో కీలకమైన నాయకులు వారు. నాడు వారు చేసిన తప్పులు ఒక్కటిగా బయటపడుతున్నాయి. మైనింగ్ అక్రమాల కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు జీవతం గడుపుతుండగా… అనుచిత వ్యాఖ్యల కేసు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి మెడకు చుట్టుకుంది. మరోపక్క దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన మద్యం కుంభకోణం ముడుపులు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందాయని..సిట్ తేల్చింది. అలాగే.. రుస్తుం మైనింగ్ కేసులో ఎ-12 నిందిడిగా వైసీపీ నేత బిర‌ద‌వోలు శ్రీ‌కాంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్ త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌పై కూడా కోవూరు పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు ఆయ‌న‌కు కోవూరు పోలీసులు 41, 41-ఎ నోటీసులు జారీ చేశారు. అనిల్ అందుబాటులో లేక‌పోవ‌డంతో.. ఇస్కాన్ సిటీలోని ఆయ‌న నివాసానికి ఎస్సై రంగ‌నాథ్‌గౌడ్‌ నోటీసులు అంటించారు. అలాగే.. వైసీపీ జిల్లా అధికార‌పార్టీ ప్ర‌తినిధి వీరి చ‌ల‌ప‌తిపై కూడా ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్య‌లు, గ్రావెల్ అక్ర‌మ త‌ర‌లింపు వంటి నాలుగు కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న అండ‌ర్ గ్రౌండ్‌కు వెళ్లిన‌ట్లు తెలిసింది. వీరితోపాటు కోవూరు వైసీపీ నేత‌లు ప‌చ్చిపాల రాధాకృష్ణారెడ్డి, అనూప్‌రెడ్డి, హ‌రిప్ర‌సాద్‌రెడ్డిల‌పై కూడా కేసులు న‌మోద‌య్యాయి. వారికి కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో జిల్లాలో ప‌ట్టు ఉన్న కాకాణి, ప్ర‌స‌న్న‌, అనిల్‌, బిర‌ద‌వోలు శ్రీ‌కాంత్‌రెడ్డి, వీరి చ‌ల‌ప‌తి వంటి నేత‌లు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో.. జిల్లాలో పార్టీ, కేడ‌ర్‌లో నిస్తేజం నెలకుంది. ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారు…? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

జిల్లాలో వీరందరితరుపున పోరాడేది ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఒక్క‌డిగా క‌నిపిస్తుంది. కాకాణిపై కేసులు పెట్టి రిమాండ్‌కు పంపిన‌ప్ప‌టి నుంచి.. ప్ర‌స‌న్న ఎపిసోడ్ వ‌ర‌కు ఆయ‌నే అన్ని స‌మ‌స్య‌ల‌కు ముందుంటున్నారు. అనిల్‌కుమార్ యాద‌వ్‌, ఇత‌ర నేత‌ల‌కూ పోలీసులు నోటీసులు జారీ చేసినా.. ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి ఖండించారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో వైసీపీ అధిష్టానం కూడా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌తలు అప్ప‌గించి.. జిల్లా భారాన్ని కూడా ఆయ‌న‌పైనే పెట్టింది. ముఖ్య‌నేత‌లంతా ఇలా.. ఏదో ఒక కేసుల్లో ఇరుక్కుంటుండంతో వారంద‌రి త‌ర‌ఫున పోరాడే బాధ్య‌త చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పై ప‌డింద‌న‌డంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *