శ్రీ నాగేశ్వరస్వామి ఆలయంలో ఆడి కృతిక పూజలు
కమనీయం…సుబ్రహ్మణేశ్వరస్వామి కళ్యాణం
- శ్రీ నాగేశ్వరస్వామి ఆలయంలో ఆడి కృతిక పూజలు
శ్రీ వల్లి దేవసేన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక పూజలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా…స్వామి, అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ పర్వతరెడ్డి కవిత, ప్రభాకర్ రెడ్డి దంపతులు నూతనంగా తయారు చేయించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు సంప్రోక్షణ చేసి అభిషేకాలు చేశారు. ఆలయ ఆవరణంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుతీర్చి పసుపు, గంధం, పంచామృతంతో పాటు కుంకుమ, సుగంధద్రవ్యాలతో అభిషేకాలు చేసి విశేష అలంకరణలు చేశారు. సాంప్రదాయ బద్దంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి, కంకణాలు కట్టి, బాషికాలను ధరింపజేసి, జిలకరా బెల్లం పెట్టి, మాంగల్యధారం జరిపించారు. తలంబ్రాలు పూయించారు. పూలమాలలు మార్పించి కళ్యాణ వేడుకను కన్నులపండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కల్యాణోత్సవం లో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. ఈ కల్యాణోత్సవం లో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు ముప్పాళ్ల శ్రీహరి రెడ్డి, రాజశేఖర్, సాయి, సునీల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.