గిరిజనుల అవేదన
ఇళ్ల నిర్మాణంలో వైసీపీ నాయకుడి చేతివాటం..
- గిరిజనుల అవేదన
గిరిజనుల పక్కా ఇళ్ల నిర్మాణంలో వైసిపి నాయకుడు తన చేతివాటం ప్రదర్శించి నిధులు కాజేసిన ఉదంతం పొదలకూరు మండలం నావూరుపల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నావూరుపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో యాకసిరి స్వాతి, నల్లి అంకోజ్, ధను జయమ్మ, ఇండ్ల పోలమ్మలకు 2023లో పక్కా ఇల్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ఇళ్ల నిర్మాణంలో గిరిజనుల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని ఆ గ్రామానికి చెందిన ఓ వైసిపి నాయకుడు వారి పేరుతో 2023 లోనే ఇల్లు నిర్మించకుండానే నిర్మించినట్లు చూపించి బిల్లులు చేసుకుని స్వాహా చేశాడు. కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన ఆ వైసీపీ నాయకుడు తన తెలివితేటలను ప్రదర్శించి నేరుగా గిరిజనుల ఖాతాల్లోనే బిల్లులు జమ అయ్యేటట్లు చేశాడు. ఇళ్ల నిర్మాణం చెప్పడతానని చెప్పి వారి ఖాతాల్లోని నగదు డ్రా చేయించుకొని మింగేశాడు. నగదు తీసుకొని ఏడాదైనా ఇళ్ళ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ గిరిజనులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ కాంట్రాక్టర్ ను ప్రాధేయపడ్డారు. దీంతో ఆ వైసీపీ నాయకుడు బిల్లులు పడ్డాక ఏడాది తర్వాత నింపాదిగా 2024లో తూతూ మంత్రంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టి వాటిని అసంపూర్తిగా వదిలేశారు. కిటికీలు తలుపులు అమర్చలేదు, గోడలకు ప్లాస్టింగ్ చేయలేదు, ఫ్లోరింగ్ నిర్మాణం అసలే చేయలేదు. గోడలు నెర్రెలు బారి దుర్భరంగా తయారయ్యాయి. ఇళ్ళ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ నిర్మాణం పూర్తికాకుండానే బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించి కాంట్రాక్టర్ వద్ద తన స్వామి భక్తిని చాటుకున్నాడు. ప్రస్తుతం అసంపూర్తి ఇళ్లలో నివాసం ఉండలేక గిరిజనులు బయట గ్రామాలకు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. ఉన్న ఒకరిద్దరు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.