కమిషనర్ వైవో నందన్ – కార్పొరేషన్ గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన అధికారులు
విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం
- కమిషనర్ వైవో నందన్
- కార్పొరేషన్ గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన అధికారులు
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి, విజయదశమి నాటికి బి,సి కేటగిరీల డబల్ బెడ్ రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాలవల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటికోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. గ్రీవెన్స్ కి మొత్తం 59 అర్జీలు వచ్చాయన్నారు. నిర్దేశించిన సమయంలోపు సమస్యలన్నిటిని పరిష్కరించాలని విభాగాల ఉన్నతాధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఇ రామ్మోహన్రావు, టౌన్ ప్లానింగ్ సిపి హిమబిందు, సెక్రటరీ శ్రీలక్ష్మి, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.