కలిగిరికి బైపాస్..!!_
కావలికి రింగ్ రోడ్డు..
కలిగిరికి బైపాస్..!!
దుత్తలూరు – కావలి హైవే కలకత్తా – కన్యాకుమారి హైవేకు బైపాస్ కనెక్టింగ్
కావలి పట్టణ పైభాగం నుంచి రింగ్ రోడ్డు. కలిగిరికి పక్కగా బైపాస్ రోడ్డు నిర్మాణం
కావలి పట్టణానికి 20 కిలోమీటర్లమేరా రింగ్ రోడ్డు నిర్మాణం..?
డిపీఆర్ ( సమగ్ర ప్రతిపాదనలు) పంపాలని కోరిన కేంద్ర రోడ్డు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ
కావలి పట్టణం అంచలంచెలుగా విస్తరిస్తుంది.. అంతే స్థాయిలో రద్దీ పెరిగిపోతుంది.. పట్టణంలో ఒక్క ట్రంక్ రోడ్డు అనుసంధానంగానే అన్నీ రాకపోకలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతున్నారు. దీనికితోడు దుత్తలూరు – కావలి జాతీయ రహదారి నిర్మాణం కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు మీదుగా అనుసంధానం చేశారు. విజయవాడ నుంచి కడపకు వెళ్లేందుకు వయా కావలి మీదుగానే అధికంగా వెళుతుంటారు. వాహనాలన్నీ
కావలి పట్టణంలో నుంచి వెళ్లాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలోనే దుత్తలూరు నుంచి కావలికి వచ్చే జాతీయ రహదారికి.. కావలి పట్టణానికి పడమర వైపు నుంచి బైపాస్ రోడ్డు నిర్మించకుండా.. అనాలోచిత నిర్ణయంతో.. కావలి పట్టణంలో నుంచి నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పలుమార్లు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు కూడా. కావలి – దుత్తలూరు జాతీయ రహదారికి.. కావలి పైభాగాన బైపాస్ నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు లను పలుమార్లు కోరారు. నేషనల్ హైవేల విస్తరణలో ఇటీవల కేంద్ర రోడ్డు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్రంలో పది జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కావలి – దుత్తలూరు జాతీయ రహదారి ఉండడం, ఈ రోడ్డులో ఉన్న కావలి, కలిగిరి పట్టణాలకు బైపాస్ నిర్మాణాలకు డిపిఆర్ లు కోరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు డి పి ఆర్ లు పంపిస్తే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో కావలికి రింగ్ రోడ్డు కల నెరవేరనుంది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి పట్టణంకూడా ఎంతో కీలకంగా ఉంది. నెల్లూరుకు.. మరోవైపు కొండాపురం మీద ప్రకాశం జిల్లాకు, ఉదయగిరికి ప్రాంతాలకు వెళ్లేందుకు జంక్షన్ పాయింట్ గా ఉంది. ఇక్కడ కూడా జాతీయ రహదారిని కలిగిరి పట్టణంలో నుంచి నిర్మించడంతో ఇబ్బందులు పడుతున్నారు. కలిగిరికి బైపాస్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డీపీఆర్ లు కోరింది. దీనిపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.