ఉపాధి కూలీలతో కలెక్టర్ ఆనంద్ – అల్లూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన
ఏమమ్మా.. పనులు కల్పిస్తున్నారా..
-ఉపాధి కూలీలతో కలెక్టర్ ఆనంద్
- అల్లూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన
ఏమన్నా ఉపాధి పనులు కల్పిస్తున్నారా… కూలీ నగదు సకాలంలో అందుతుందా.. అంటూ కలెక్టర్ ఆనంద్ ఉపాధి కూలీలతో మాట కలిపారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా గాలి దిబ్బలు గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం అల్లూరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను పరిశీలించారు. అలాగే బీసీ బాలికల వసతిగృహంలో పర్యటించి స్థానిక సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గాలి దిబ్బలు గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన స్థానిక కూలీలతో మాట్లాడారు. మీకు 120 రోజులు పని దినాలు కల్పిస్తున్నారా… సకాలంలో కూలి నగదు అందుతుందా అంటూ ప్రశ్నలు కురిపించారు. అంతే కాకుండా వరి సాగు పొలాల్లో ప్రత్యామ్నాయంగా పంటలను కూడా వేసుకోవాలని సూచించారు. తద్వారా ఆదాయం వనరులను పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా కూరగాయ పంటలపై దృష్టి సారించాలని మహిళలను కోరారు. ఈయన వెంట కావలి ఆర్డీవో వంశీకృష్ణ, అల్లూరు తహసిల్దార్ లక్ష్మీనారాయణ, కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో రజనీకాంత్, తదితరులు ఉన్నారు