అనుమానంతోనే భార్యపై కత్తితో దాడి
అడ్డొచ్చిన అత్తమామలను హతమార్చిన అల్లుడు
దుత్తలూరులో జంట హత్యలు కలకలం
అల్లుడే.. యముడు
- అనుమానంతోనే భార్యపై కత్తితో దాడి
- అడ్డొచ్చిన అత్తమామలను హతమార్చిన అల్లుడు
- దుత్తలూరులో జంట హత్యలు కలకలం
ఇంటి అల్లుడే అత్తమామల పాలిట యముడుగా మారాడు…అనుమానం అనే పెనుభూతంతో భార్యపై కత్తితో దాడికి ఒడిగట్టాడు…కళ్లెదుటే తమ కూతురుపై అల్లుడు దాడి చేస్తుండగా… అడ్డొచ్చిన అత్తమామలను సైతం కత్తితో దారుణంగా నరికి హతమార్చాడు….అనుమానంతో ఇద్దరు ప్రాణాలు తీసి…ఒకరిని దారుణంగా గాయపరిచిన సంఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏసీ కాలనీలో చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా దుత్తలూరు ఏసీ కాలనీలో వెంగయ్య, వెంకాయమ్మ దంపతులు జీవిస్తున్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో భార్య వెంకాయమ్మ తన పుట్టింటికి వచ్చేసింది. కోపోద్రిక్తుడైన భర్త వెంగయ్య మద్యం మత్తులో వెంకాయమ్మ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. అతని వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై దాడి చేస్తుండగా, పక్కనే ఉండి అది గమనించిన అత్త జయమ్మ, మామ చలంచర్ల కల్లయ్యలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఊగిపోతున్న వెంగయ్య వెంకామయ్మ తల్లిదండ్రులపై కూడా కత్తితో దాడికి తెగపడ్డాడు. తీవ్రమైన కత్తిపోట్లతో వారు అక్కడికక్కడే మృతి చెందాడు. హంతకుడు వెంగయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హత్య జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. దాడిలో గాయపడిన భార్య వెంకాయమ్మను చికిత్స నిమిత్తం ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. హంతకుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జంట హత్యల నేపథ్యంలో దుత్తలూరు ఏసీ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.