పీఎస్ఎల్వీ సి-60లో ప్రయోగించే స్పారిక్స్ ఉపగ్రహం ప్రత్యేకమైన ఉపగ్రహం
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
రాకెట్ ప్రయోగం విజయవంతం కోసం చెంగాళ్లమ్మ గుడిలో పూజలు
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్ నుంచి ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సి-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డీఆర్ సోమనాథ్ సోమవారం సూళ్లూరుపేటలో వెలసివున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో బి. ప్రసన్న లక్మీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మణ్ణి పాదాల చెంత రాకెట్ నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో సోమనాథ్‌కు ఈవో చేతులమీదుగా ఆలయ మర్యాదలు, వేద పండితులచే ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిఎస్ఎల్వి – సి- 60 రాకెట్ ప్రయోగంలో స్వల్ప మార్పులు చేయడం జరిగిందని.. ముందు నిర్ణయించిన సమయం కన్నా 2 నిమిషాల 15 సెకండ్లు ఆలస్యంగా పిఎస్ఎల్వీ – సి 60 రాకెట్ ప్రయోగం జరుగుతుందన్నారు. సోమవారం రాత్రి 10గంటల 15 సెకండ్లకు రాకెట్ ప్రయోగం జరుగుతుందని.. ప్రయోగ కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతుందని ఈసందర్భంగా ఆయన వివరించారు. ఈ ప్రయోగంలో రెండు ఉపగ్రహాలను అమర్చి.. నింగిలోకి పంపడం జరుగుందనని.. 2024కన్నా.. 2025లో అత్యధిక ప్రయోగాలు చేపడతామన్నారు. వచ్చే మార్చిలోపు జీఎస్ఎల్‌వీ ఎఫ్-15, పీఎస్ఎల్‌వీ సి-61, జీఎస్ఎల్‌వీ ఎంకే-3 ప్రయోగాలు చేపడతామని ఆయన వివరించారు. గగన్‌యాన్ టెస్టెడ్ ఫ్లైట్ కూడా మరో రెండు మూడు మాసాల్లో ప్రయోగిస్తామని.. యూఎస్ దేశానికి చెందిన నిసార్ ఉపగ్రహం నింగిలోకి పంపేందుకు ఇస్రో శ్రీకారం చుట్టిందని ఈసందర్భంగా ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.