కావలిలో మరో జాన్ ప్రభాకర్

కావలిలో హిమ్ తరహా మనీ స్కీమ్..!

  • ఈ సారి షేర్ మార్కెట్ పేరుతో మోసం
  • డబ్బులు కడుతూ.. కట్టిస్తున్న వారిలో కొందరి పోలీసులదే పెద్దన్న పాత్ర
  • రాష్ట్ర పోలీసు అధికారికి పిర్యాదు
  • ప్రధాన వ్యక్తిని విచారిస్తున్న పోలీసు అధికారులు

ఆశకు హద్దేలేదు… మోసాలకు కొదవేలేదు..అగ్రిగోల్డ్, సిరి గోల్డ్, హిమ్ వంటి ఎన్నో మోసాలు చవి చూశాము. ఇప్పటికీ వాటి బాధితులు కోలుకోలేని పరిస్థితి. లక్షల రూపాయలు కట్టి ఎన్నో కాపురాలు కుప్పకూలాయి. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కళ్లారా చూశారు. అయినా జనాల ఆశకు హద్దులే లేకపోవడంతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కావలి పట్టణంలో హిమ్ తరహా మోసం మరొకటి బయట పడింది. షేర్ మార్కెట్ పేరిట లక్షల రూపాయలు కట్టిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని, ఊరు పేరు లేని ఒక భవనంలో షేర్ మార్కెట్ శిక్షణా కేంద్రం పేరుతో కొత్త తరహా మనీ స్కీమ్ కు తెరలేపారు. అసలు ఈ షేర్ మార్కెట్ మనీ స్కీమ్ ఏమిటి..? దీనిని నడుపుతున్న వ్యక్తి ఎవరు..? పోలీసుల పాత్ర ఏమిటి..? ఆలస్యంగా తేరుకున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు తెలియాలంటే ఎన్ త్రీ న్యూస్ చూడాల్సిందే..!

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ముసునూరుకు సుభాని అనే వ్యక్తి షేర్ మార్కెట్ లో దిట్ట. ముసునూరులోనే షేర్ మార్కెట్ శిక్షణా కేంద్రం అంటూ ఒక కార్యాలయాన్ని 2022లో ప్రారంభించాడు. ఎవరైనా డబ్బులు కడితే ఆ డబ్బులు షేర్ మార్కెట్ లో పెట్టీ లాభాలు వచ్చాక ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేలా నమ్మించాడు. ముందుగా సమాజంలో పలుకుబడి ఉన్న వారు, కొందరు పోలీసులను తన టీమ్ లో నియమించుకున్నాడు. వారి చేత జనాలను నమ్మించి లక్షల రూపాయలు కట్టించడం ప్రారంభించారు. ఏర్పాటు చేసిన భవనానికి ఎలాంటి బోర్డు కానీ, అనుమతులు కానీ లేవు. జనాలు కట్టే డబ్బులకు ఎలాంటి రసీదు లేదు. ఎవరైతే డబ్బులు కట్టిస్తారో వారిపై నమ్మకమే ఆధారం. జరిగే మోసం ఒక సారి పరిశీలిస్తే.. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక లక్ష కడితే ఆ తర్వాత నెల నుంచి అతనికి నెలకు 10 వేల రూపాయలు కమీషన్ ఇస్తారు. ఇందులో 2 పర్సెంట్ డబ్బులు కట్టించిన వ్యక్తి పట్టుకుని మిగిలిన 8 వేల రూపాయలు అసలు కట్టిన వ్యక్తికి చేరుతుంది. ఇదే వ్యక్తి మరొకరి చేత కట్టిస్తే తనకు నెలవారీగా వచ్చే కమీషన్ తోపాటు, ఇతను కట్టించిన వ్యక్తికి వచ్చే కమీషన్ నుంచి మరో 2 పర్సెంట్ యాడ్ చేసి ఇస్తారు. ఇలా ఒక్కొకరు రూ.30 లక్షలు, కోట్ల రూపాయలు కట్టించారు. కమీషన్ల ఆశ చూపుతూ కట్టినవారి డబ్బులనే అటూ ఇటూ రొటేషన్ చేస్తూ బాగా నమ్మకం కలిగించారు. ఇప్పటి వరకు సుమారు 50 కోట్ల రూపాయలు జనం నుంచి కట్టించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల పాత్ర ఉందని తెలుస్తుంది. ఈ వ్యవహారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరినట్లు తెలిసింది. ఇలాంటి మోసాలు కావలి నియోజకవర్గంలో జరగడానికి వీలులేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆలస్యంగా స్పందించిన పోలీసు అధికారులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారంలో ప్రముఖ పాత్ర పోషించిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల పై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *