ఆ…నీటిని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే…!

  • రూ. కోట్ల ప‌నులు జ‌రుగుతున్నా…హెచ్చ‌రిక బోర్డులు క‌నిపించ‌ని వైనం

స‌ముద్రం, జలాశయం, చెరువులలో నీటిని చూసి ఎవరైనా దిగాలంటే భయపడక తప్పదు.. అయితే చిన్నపాటి నీటిని చూసి కూడా ద్విచక్ర వాహనదారులు భయపడి ప్రమాదంలోకి వెళుతున్న పరిస్థితి.. కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నా ఎక్కడా హెచ్చరిక బోర్డులు కనిపించని వైనం.

గతంలో వచ్చిన వరదలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం ముందు భాగంలో ఉన్న ఆఫ్రాన్ ప్రాంతం దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరమ్మత్తుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తుంది. కొన్ని రోజులు ఆఫ్రాన్ ప్రాంతం పనులు గుత్తేదారుడు చేసి రాడ్డులను వదిలేసి డ్రైవర్సన్ వాల్ పనులను ప్రారంభించారు. ఆఫ్రాన్ ముందు ఉన్న సోమశిల నుంచి నెల్లూరుకు వెళ్లే రోడ్డు పైకి వర్షపు నీరు చేరడంతో నీటిలో వెళ్లేందుకు ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెంది గుత్తేదారుడు నామమాత్రంగా పనులు చేసి వదిలేసిన రాడ్డుల మధ్యలో నుంచి వెళ్తుండడంతో ఏ సమయంలో…. ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితి. డ్రైవర్షన్ కెనాల్ పై ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో వాహనదారులు తీవ్రభయాందోళన చెందుతున్నారు. గతంలో ఓ ఘటన జరిగినా కూడా అధికారుల తీరు మాత్రం మారడం లేదని సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

అటు కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నప్పటికీ, పనులు జరిగే చోట పలు ప్రమాద ప్రదేశాలు ఉన్న ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. పనుల వద్ద అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండడంతో గుత్తేదారుడు నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు రోడ్డుపై వర్షపు నీరు చేరకుండా, బ్రిడ్జిపై సేఫ్టీ ని కల్పించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *