శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవికి ఘన నివాళులు
నెల్లూరులో 69వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జనసైనికులతో కలిసి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పోరాట పటిమతోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందన్నారు.
అదే విధంగా శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సింగం శెట్టి మురళీ మోహన్ రావు, క్లబ్ సభ్యులతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు అమరజీవి అని కొనియాడారు.
అలాగే జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేపట్టి ఆశువులు బాసి భాషా యుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహానుభావుడు అమరజీవి అన్నారు.